

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. శనివారం వేకువజామున 3 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన.. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్రమైన సేవగా భావించే నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కల్యాణ్.. గర్భాలయంలో నిర్వహించిన ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు.
నిర్మాల్య దర్శనం అనంతరం సంప్రదాయం ప్రకారం నిర్వహించే తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నైరుతి దిశలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి, అనంత పద్మనాభస్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయ ప్రదక్షిణలో భాగంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువాయూర్ మేల్ శాంతితోపాటు ఇతర ప్రధాన అర్చకులు పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదించి స్వామివారి కళభం, ఇతర ప్రసాదాలను అందజేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!