

నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వేలో అలనాటి అమరావతి చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలు వెలుగులోకి రావడం గొప్ప పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా అయ్యంబొట్లపల్లె సమీపంలో చేపట్టిన అన్వేషణలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించిందని, అది అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాకతీయ రాణి రుద్రమదేవి సేనాధిపతి మల్లికార్జున నాయకుడు ధాన్యకటకం (ప్రస్తుత అమరావతి)లోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ఆ శాసనం పేర్కొంటోందని అధికారులు వెల్లడించారు. ఈ ఆధారాలు అమరావతి బౌద్ధ వారసత్వాన్ని మరింత బలపరుస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చారిత్రక సంపదను సంరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నల్లమలలో మరిన్ని పరిశోధనలకు అటవీశాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!