

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో ఆయన అమ్మమ్మ శనివారం ఉదయం వయోభారంతో కన్నుమూశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓటు చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిన అభిజీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు అమ్మమ్మ మరణవార్త తెలియజేశారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మహారాష్ట్రకు వెళ్లేలా, అవసరమైతే విమాన ప్రయాణ ఏర్పాట్లలోనూ సహకరిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. అయితే, నిర్బంధంలోనే ఉండి నిరసన కొనసాగించాలా, లేక స్వగ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొనాలా అన్నది అభిజీత్ నిర్ణయించుకోవాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
అభిజీత్ ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లతో కలిసి విమానంలో ప్రయాణిస్తుండగా, ఢిల్లీకి చేరుకున్న వెంటనే విమానం దిగకముందే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యపై అభిజీత్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమానం దిగకముందే కుమారుడిని అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తల్లి అనితా దీప్కే ప్రశ్నించగా, సీజేపీ నిరసనకు తన పూర్తి మద్దతు ఉంటుందని తండ్రి భగవాన్‌రావ్ తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నిరసనల సందర్భంగా నాలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులతో పాటు వందలాది మంది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!