

అమెరికాలో చదువుకుంటున్న భారతీయులతో పాటు ఇతర దేశాల విదేశీ విద్యార్థులకు ఊరటనిస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విదేశీ విద్యార్థులు (ఎఫ్-1 వీసా), పరిశోధకులు (జే-1), పాత్రికేయులు (ఐ వీసా) అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలను కోర్టు కొట్టివేసింది. ఈ విధానం నిరంకుశంగా, వివేకరహితంగా, చట్టవిరుద్ధంగా ఉందని ఫెడరల్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం తీర్పులో పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యావకాశాలు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తుండగా, వారి నివాస కాలాన్ని పరిమితం చేసే విధానం ఆ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని, ఎఫ్-1 వీసా కార్యక్రమాన్ని బలహీనపరిచే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పును ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్‌ఐఐడీఎస్) స్వాగతించింది.
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం ఎఫ్-1, జే-1 వీసాదారులు అమెరికాలో ఉండే కాలవ్యవధిని నాలుగేళ్లకు పరిమితం చేయాలని, ఆ తర్వాత కొనసాగాలంటే ఇమిగ్రేషన్ శాఖ నుంచి మరోసారి అనుమతి తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. చదువు లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) పూర్తయ్యాక దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఐ వీసాదారుల గడువును ఐదేళ్ల నుంచి 240 రోజులకు, చైనా జర్నలిస్టుల విషయంలో 90 రోజులకు కుదించాలని సూచించింది. ఈ విధానంపై బోస్టన్ కోర్టు సెప్టెంబరులోనే ప్రాథమిక ఇంజంక్షన్ విధించగా, డీహెచ్‌ఎస్ ఫస్ట్ సర్క్యూట్ అపీళ్ల కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అపీళ్ల కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!