

అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా, 2026–27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పటిష్ట ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగి రూ.3,650 కోట్లను దాటింది. 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వేదాంతా రూ.1,798 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కమోడిటీల ధరలు పుంజుకోవడం, అనుకూలమైన విదేశీ మారకపు విలువల కదలికలు, అమ్మకాల పరిమాణం పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
కంపెనీ మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగి, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.16,736 కోట్ల నుంచి రూ.26,356 కోట్లకు చేరింది. మరోవైపు, జింక్ ఇండియా తన చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక మైన్డ్ మెటల్ ఉత్పత్తిని సాధించినట్లు వేదాంతా వెల్లడించింది. జూలై–సెప్టెంబర్ కాలంలో 2,71,000 టన్నుల మైన్డ్ మెటల్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో వెండి ఉత్పత్తి కూడా 20 శాతం పెరిగి 173 టన్నులకు చేరింది. కీలక వ్యాపార విభాగాల్లో మెరుగైన పనితీరు, ఉత్పత్తి పరిమాణం పెరగడం కంపెనీ ఫలితాలకు తోడ్పడ్డాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!