

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బ అధికార మహాయుతి కూటమిలో విభేదాలకు దారితీసింది. ఎన్నికల్లో శిందే నేతృత్వంలోని శివసేన సహకరించలేదని, కూటమి ధర్మాన్ని పాటించకుండా భాగస్వామ్య పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించిందని భాజపా ప్రధాన అధికార ప్రతినిధి నవనాథ్ బాన్ విమర్శించారు. పుణె ఉపాధ్యాయుల నియోజకవర్గంలో చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వడం, ఛత్రపతి సంభాజీనగర్‌లో శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ ఎన్సీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూటమి విజయావకాశాలను దెబ్బతీశాయని ఆరోపించారు. అయితే తాము ఎప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పష్టం చేశారు. పుణె వంటి ప్రాంతాల్లో స్నేహపూర్వక పోటీ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు, శివసేనతో పొత్తు కొనసాగించాలా వద్దా అనేది భాజపానే నిర్ణయించుకోవాలని అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో భాజపాకు 132 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ప్రభుత్వం కొనసాగాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరమని సత్తార్ గుర్తుచేశారు. బిహార్‌లో జేడీయూకు తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించినట్లే, మహారాష్ట్రలోనూ శిందేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థికి సత్తార్ మద్దతు పలకడంతో అధికార ఎన్సీపీ అభ్యర్థి సతీశ్ చవాన్ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా, బిహార్‌లోని దర్భంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంపై భాజపా, ఆర్జేడీ పరస్పరం విజయ ప్రకటనలు చేసుకున్నాయి. సిటింగ్ ఎమ్మెల్సీ సర్వేశ్ కుమార్ గెలిచారని భాజపా ప్రకటించగా, తమ అభ్యర్థి అనిల్ కుమార్ ఝా విజయం సాధించారని ఆర్జేడీ పేర్కొంది. ఆ సమయంలో అధికారిక ఫలితం ప్రకటించాల్సి ఉందని సమాచారం.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!