

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన “జై జవాన్ – జై కిసాన్ – జై యువ” అనే కొత్త నినాదాన్ని ప్రతిపాదిస్తూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతకు మరింత అవకాశాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం యువత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా, ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో చట్టసభల్లోనూ వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సీబీఎస్‌ఈ, నీట్, నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలను కూడా కేంద్రం పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ అంశంపై ఆగస్టులో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం అధికారిక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్‌తో పాటు పోటీ వయోపరిమితి తగ్గింపును కూడా కేంద్రం పరిశీలించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!