

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్తుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ రాజకీయ పోరు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నేతలు గుర్తుచేస్తూ, వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు జరిగిన మేలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
బీఆర్‌ఎస్ చేపడుతున్న వరుస నిరసనలతోపాటు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష విమర్శలకు దీటుగా స్పందిస్తోంది. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తోంది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల ఫలాలను వివరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టగా, వెయ్యి రోజుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
జిల్లాలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలను సభలు, ప్లెక్సీలు, ఆరోపణలకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరి వెంట పార్టీ కేడర్ కదులుతోంది, స్థానిక సమస్యలపై ఎవరు నిరంతరం పోరాడుతున్నారన్నదే నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను అభివృద్ధి నివేదికగా ప్రచారం చేసుకుంటుండగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకునే అవకాశంగా మలుచుకుంటోంది. దీంతో జిల్లాలో మొదలైన వెయ్యి రోజుల రాజకీయ పోరు భవిష్యత్ ఆధిపత్యానికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!