

2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇది ‘మెగా డీఎస్సీ’ కాదని, నిరుద్యోగులు, అర్హులైన అభ్యర్థులను మోసం చేసిన డీఎస్సీ అని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన జగన్.. ప్రశ్నపత్రాల తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడం, మెరిట్ జాబితాల్లో మార్పులు, అభ్యర్థుల ఐడీలను బ్లాక్ చేయడం, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు. SCERTలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని, వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అలాగే స్పోర్ట్స్ కోటా విషయంలో జీవోలను మార్చడం, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా నేరుగా నియామకాలకు అవకాశం కల్పించడం, అనంతరం సంబంధిత జీవోలను ఉపసంహరించడంపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. టీచర్ పోస్టుల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఆడియో, వీడియో కాల్స్‌పై దర్యాప్తు ఎందుకు సరిగా జరగలేదని ప్రశ్నించారు.
డీఎస్సీ అక్రమాల వెనుక పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కు జరిగిందని జగన్ ఆరోపించారు. జరగని క్రీడా పోటీలు జరిగినట్లు చూపిస్తూ తప్పుడు సర్టిఫికెట్ల ఆధారంగా కొందరికి పోస్టులు ఇచ్చారనే ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలను దుర్వినియోగం చేశారని, డబ్బులు లేదా వ్యక్తిగత పరిచయాల ఆధారంగా పోస్టులు కేటాయించారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ అంశాలపై తాను గతంలో పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి సూటిగా సమాధానాలు రాలేదని జగన్ అన్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్న కేస్ స్టడీలు డీఎస్సీ ప్రక్రియలోని వివిధ కోణాలను బయటపెడుతున్నాయని, ఒక అక్రమాన్ని పరిశీలిస్తే మరో అంశం వెలుగులోకి వస్తోందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!