

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. రష్యా అధికారుల ప్రకారం.. భారీ డ్రోన్ దాడిలో 1600కుపైగా ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపారు. వీటిలో సుమారు 450 డ్రోన్లు మాస్కో వైపు వచ్చినట్లు పేర్కొన్నారు. మాస్కోలోని చమురు శుద్ధి కర్మాగారంతో పాటు పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజునే ఈ దాడులు జరగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ దాడులు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకేనని రష్యా అధికారులు ఆరోపించారు. అయితే దాడులపై రష్యా వెల్లడించిన అన్ని వివరాలను ఉక్రెయిన్ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఇదిలా ఉండగా.. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభమైన తర్వాత రష్యాలో తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు ముగిశాయి. సుమారు 11.1 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులుగా ఉన్నారు. రష్యా తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్ ప్రాంతాల్లోనూ ఓటింగ్ నిర్వహించింది. దీనిని ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ వ్యతిరేకించాయి. ప్రాథమిక ఫలితాల్లో పుతిన్‌కు అనుకూలమైన యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఉక్రెయిన్ పాత్రికేయుడు దిమిత్రొ గొర్డన్.. రాబోయే వారం లేదా రెండు వారాల్లో తమ దేశానికి ఆశ కలిగించే కీలక పరిణామం చోటుచేసుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే దాని వివరాలను వెల్లడించలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!