

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులుగా భావిస్తున్న వర్గాలు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా గగనతల రక్షణ వ్యవస్థలు ఎందుకు అడ్డుకోలేకపోయాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభమైనట్లు కథనాలు వెల్లడించాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగినట్లు పేర్కొన్న దాడిలో సుమారు 13 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో భాగంగా హూతీలు తొలుత పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి, ఆ తర్వాత క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నట్లు కథనం తెలిపింది. వెయ్యి కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను రక్షణ వ్యవస్థలు ముందుగానే గుర్తించలేకపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
హూతీల వద్ద ప్రయాణ సమయంలో దిశను మార్చుకోగల అధునాతన మార్గనిర్దేశక వ్యవస్థలతో కూడిన బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి సౌదీ అరేబియా వినియోగించే పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు సహా ఇతర గగనతల రక్షణ వ్యవస్థలకు సవాల్‌గా మారుతున్నాయి. సోమవారం కూడా సౌదీపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల భద్రత కోసం సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణ అవసరమని యూఏఈ దౌత్య సలహాదారు అన్వర్ గర్గాశ్ పిలుపునిచ్చారు. సౌదీ అరేబియాపై దాడులు యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల భద్రతను కూడా ప్రభావితం చేయగలవని ఆయన హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!