

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైలు కార్యకలాపాల భద్రతపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌ఎంలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. నెలలో అధికారులు నిర్వహించిన రాత్రి తనిఖీలను సమీక్షించిన జీఎం.. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు.
ఓహెచ్‌ఈ, విద్యుత్ పరికరాల వద్ద పనిచేసే క్షేత్రస్థాయి, కాంట్రాక్ట్ సిబ్బంది భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. కార్యస్థల భద్రత, వివిధ శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సిబ్బందికి తాజా భద్రతా ప్రమాణాలు, నిబంధనలు, నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించేందుకు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్లు, రైళ్లు, గూడ్స్ షెడ్లు, ఇంటర్‌లాకింగ్ లేని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటును కూడా సమీక్షించారు. జోన్‌లో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!