

దేశంలో ఇథనాల్ వ్యాపారం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని ద్వారా వచ్చే లాభాలు పెద్ద చక్కెర కర్మాగారాలకే పరిమితం కాకుండా సామాన్య చెరుకు రైతులకు కూడా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం కోరింది. సంఘం అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ.. బ్రెజిల్ తరహాలో వికేంద్రీకృత ఇథనాల్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తే రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక బెల్లం తయారీ యూనిట్లలోనే రైతులు ఇథనాల్ ఉత్పత్తి చేసుకునేలా సరళమైన నిబంధనలతో ప్రత్యేక విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
స్థానిక యూనిట్లలో తయారయ్యే ఇథనాల్‌ను రైతులు తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు ఇంధనంగా వినియోగించుకోవచ్చని సంఘం సూచించింది. మిగిలిన ఇథనాల్‌ను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసే విధానం తీసుకొస్తే రైతుల ఇంధన వ్యయాలు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి కరువు ప్రభావిత ప్రాంతాల్లో చెరుకు రైతులకు మెరుగైన ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అందించాలని, చక్కెర మిల్లుల ఉప ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాల్లో రైతులకు కూడా వాటా కల్పించాలని కోరింది. చెరుకు ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో మిగులు చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించి చక్కెర ధరలు పడిపోకుండా చూడాలని, కరువు సమయంలో ఇథనాల్ ఉత్పత్తిని నియంత్రించి దేశీయ అవసరాలకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!