

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించడం, సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో గ్రామ పటాలను రూపొందించి రహదారులు, తాగునీటి వనరులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పారిశుధ్య సదుపాయాలు, సాగునీటి వనరులు, ఇతర మౌలిక వసతులను అందులో గుర్తించారు.
గ్రామసభల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వర్షపు నీటి సంరక్షణ, ఉపాధి, జీవనోపాధి, వ్యవసాయం, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.. గ్రామసభల్లో తీసుకున్న తీర్మానాలు, ప్రజల సూచనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ అవసరాలను GPDPల్లో ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సమన్వయం చేసుకుని ప్రాధాన్యతా పనులను చేపట్టాలని సూచించారు. గ్రామసభ నిర్ణయాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!