

అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగివచ్చి దేశ అభివృద్ధికి కృషి చేయాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థలతో పాటు ఎనిమిది కంపెనీలను పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (PERM) నుంచి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సాంకేతిక రంగ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. అయితే, అక్కడి సమాజంలోని ఒక వర్గానికి ఇక భారతీయుల అవసరం లేదనే భావన కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదిలి స్వదేశానికి రావడం బాధాకరమే అయినప్పటికీ, దాన్ని కొత్త భవిష్యత్తుకు నాందిగా చూడాలని ఎక్స్‌లో చేసిన పోస్టులో సూచించారు. ‘వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం’ అంటూ పిలుపునిచ్చారు.
విదేశీ ఉద్యోగులకు ఉద్యోగ ఆధారిత శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియలో కీలకమైన పర్మ్ వ్యవస్థను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేశాయనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం సంబంధిత కంపెనీల నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించకపోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా ప్రభావం పడవచ్చు. దీంతో తమ యజమానుల ద్వారా గ్రీన్‌కార్డ్ పొందాలని ఆశిస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న హెచ్-1బీ వీసాలు స్వయంగా రద్దు కావు. ఈ పరిణామం నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు స్వదేశంలో అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చ మళ్లీ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!