

జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన పరిటాల శ్రీరామ్ ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుస్తూ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం హిందూపురంలో హిందూపురం ఎమ్మెల్యే , నటసింహం నందమూరి బాలకృష్ణ ను ఆయన కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్.. బాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ నూతన జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్‌కు అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధిలో తనదైన మార్కు చూపించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని బాలకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా బాలకృష్ణను పరిటాల శ్రీరామ్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్య జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. తనను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌గా తనకు లభించిన బాధ్యతను పదవిగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని శ్రీరామ్ తెలిపారు




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!