

శ్రీశైలం డ్యామ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాజెక్టుల జాబితాలో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం డ్యామ్‌కు చోటు లభించింది. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి సంస్థ దక్షిణ ప్రాంతీయ సంయుక్త కార్యదర్శి ఇలియాజర్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం డ్యామ్ నిలిచిందని వెల్లడించారు. దక్షిణాసియాలో మరే ప్రాజెక్టుకూ లేని విధంగా 60 x 55 అడుగుల పరిమాణంలో భారీ క్రస్ట్ గేట్లు ఉండటం, సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తులో నిర్మాణం వంటి ప్రత్యేకతలు ఈ గుర్తింపునకు కారణమయ్యాయి.

2009లో వచ్చిన భారీ వరదల సమయంలో సెకనుకు 25.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని డ్యామ్ పటిష్టంగా నిలవడం కూడా ఈ ఘనతకు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. డ్యామ్ నిర్మాణంలో భాగస్వాములైన అప్పటి ఇంజినీర్ల కృషిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రశంసించారు. శ్రీశైలం డ్యామ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులను ఆయన అభినందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!