

టైప్ 2 ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు (T2IDs) గతంలో భావించిన దానికంటే మరింత సంక్లిష్టమైన విధానంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా క్రానిక్ సైనసైటిస్ (దీర్ఘకాలిక సైనసైటిస్) ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పుతో బలమైన సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 12.9 కోట్లకు పైగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను విశ్లేషించి, అటోపిక్ డెర్మటైటిస్, ఆస్తమా, ఆహార అలర్జీలు, ఈసినోఫిలిక్ ఈసోఫజైటిస్, క్రానిక్ సైనసైటిస్ సహా తొమ్మిది రకాల టైప్ 2 ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల మధ్య సంబంధాలను అధ్యయనం చేశారు. ఆస్తమా, క్రానిక్ సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్‌కు సంబంధించిన జన్యుపరమైన సమాచారాన్ని కూడా పరిశీలించారు.
ఈ విశ్లేషణలో క్రానిక్ సైనసైటిస్ పలు ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులతో సంబంధం కలిగిన కీలక పరిస్థితిగా గుర్తించారు. అటోపిక్ డెర్మటైటిస్, ఆహార అలర్జీలు, అలర్జిక్ మరియు వాసోమోటార్ రైనైటిస్ కూడా ఇతర వ్యాధులతో గణనీయమైన సంబంధాలను చూపించాయి. ఈ సంబంధాలు వయసు, లింగం, జాతిని బట్టి మారుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పలు వ్యాధుల మధ్య జన్యుపరమైన సారూప్యతలు ఉన్నాయని, ఉమ్మడి జన్యు నిర్మాణంలో ఆస్తమా కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు వ్యాధులు ఒకదాని తర్వాత మరొకటి ఒకే క్రమంలో వస్తాయనే సంప్రదాయ ‘అటోపిక్ మార్చ్’ సిద్ధాంతాన్ని సవాలు చేస్తున్నాయి. ఈ అధ్యయనం ఆధారంగా వ్యాధుల ముప్పును ముందుగానే అంచనా వేయడం, అధిక ప్రమాదంలో ఉన్నవారిని గుర్తించడం, నివారణ చర్యలను మెరుగుపరచడం సాధ్యమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!