

కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో పరిస్థితిపై సమీక్షించిన ఆయన, లోతట్టు, ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేపట్టాలని సూచించారు. పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షించేలా ప్రత్యేక నియంత్రణ గది ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
జలాశయాల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వర్షాలు తగ్గిన వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, బాధిత రైతులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంత పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలోని సుద్దగడ్డ వాగు ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!