

న్యాయ ప్రక్రియలో కృత్రిమ మేధ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధ్రువీకరించని ఏఐ ఆధారిత సమాచారం న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటిస్తూ, న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.
ఎస్సెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ దివాలా కేసులో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆ తీర్పులో నకిలీ, ఉనికిలో లేని పూర్వ తీర్పులను ప్రస్తావించినట్లు గుర్తించింది. ఏఐ టూల్స్ సాయంతో రూపొందించిన ఈ కల్పిత సమాచారం న్యాయ ప్రక్రియకు హానికరమని పేర్కొంటూ, ఆ తీర్పును పక్కన పెట్టింది. ధ్రువీకరణ లేకుండా రూపొందించే ఏఐ ఆధారిత తీర్పులపై కఠినంగా వ్యవహరించాలని అన్ని న్యాయస్థానాలకు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!