

తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించింది. చెన్నైలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో ఈ విస్తరణను ప్రారంభించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విద్యార్థులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల హాజరు, చదువుపై ఏకాగ్రతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం.
ఈ విస్తరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 15.30 లక్షల మంది అదనపు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం కోసం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించడంతో మొత్తం బడ్జెట్ సుమారు రూ.724 కోట్లకు చేరింది. ఉప్పుమా, కిచిడీ, పొంగల్‌తో పాటు వారంలో రెండు రోజులు మిల్లెట్ ఆధారిత వంటకాలను అందించనున్నారు. వంటల తయారీ, పంపిణీలో స్వయం సహాయక సంఘాలు, ఇంటిగ్రేటెడ్ కిచెన్లు భాగస్వామ్యం కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో ఈ విస్తరణను తాత్కాలికంగా అమలు చేయడం లేదని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!