

తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్ రంగాలు సంప్రదాయంగా బలంగా ఉన్న ఐటీ, ఫార్మా రంగాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్క్లేవ్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ రంగాల్లో ఉత్పత్తి, ఎగుమతులు ఏడాదికి 100 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయని వెల్లడించారు. బలమైన తయారీ వ్యవస్థ, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తెలంగాణకు ప్రత్యేక బలమని పేర్కొన్నారు. హైదరాబాద్కు రక్షణ పరిశోధన, ఏరోస్పేస్ తయారీలో ఉన్న సుదీర్ఘ అనుభవం రాష్ట్రానికి అదనపు ప్రయోజనమని చెప్పారు. విమాన విడిభాగాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డ్రోన్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు.
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అంతర్జాతీయ తయారీ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకుంటూ దేశీయ అవసరాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ రక్షణ, ఏరోస్పేస్ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంలో భాగంగా కొత్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, నాణ్యమైన ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహించనున్న రక్షా ఎక్స్పో 2026లో పాల్గొనాలని జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ ఎక్స్పో ద్వారా పెట్టుబడులు, సాంకేతిక సహకారం, వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన గత వైమానిక దళ పైలట్ అనుభవాలను కూడా గుర్తుచేసుకున్నారు. రష్యాలో శిక్షణ, మిగ్-23 యుద్ధ విమానాల నడిపిన అనుభవం, దేశ పశ్చిమ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన రోజులను సభికులతో పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!