

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా బోనస్ అందించనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం, అంటే రూ.596 కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ప్రజాభవన్లో మంత్రి శ్రీధర్బాబు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సంస్థలోని 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున రూ.1,53,912 చొప్పున, 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు చెప్పారు.
కార్మికుల సంక్షేమంలో భాగంగా పెండింగ్లో ఉన్న సుమారు 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లో అర్హులకు అందజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అధికారులకు పనితీరు ఆధారిత వేతనం (పీఆర్పీ) చెల్లిస్తామని చెప్పారు. మైనింగ్ జరగని సింగరేణి భూములను గుర్తించి నెహ్రూ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలో సింగరేణి సమస్యలను పరిష్కరించడంలో భారాస విఫలమైందని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!