

తెలంగాణలో ఈ ఏడాది కూడా బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలు కలిపి మొత్తం 1,25,345 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి పలు ఇంజినీరింగ్ కళాశాలలు కొత్త కోర్సులు, అదనపు ప్రవేశాల కోసం ఏఐసీటీఈకు దరఖాస్తు చేశాయి. వాటిలో దాదాపు 15 వేల సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సీట్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్వోసీ) జారీ చేయాల్సి ఉంది. అదనపు సీట్లకు అనుమతి ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు ప్రజాప్రతినిధులను కూడా కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సుమారు 70 శాతం సీట్లు ఉండటంతో ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కోర్ ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని సీట్లు అవసరమా అనే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఆయా కళాశాలల ప్రవేశాల పరిస్థితి, అధ్యాపకుల లభ్యత, మౌలిక వసతులు, విద్యా నాణ్యతపై నివేదికలు కోరింది. తుది నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. అదనపు సీట్లు మంజూరైతే అవి రెండో విడత కౌన్సెలింగ్లో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!