

తెలంగాణలో 22-ఎ భూముల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. జీఓ 59 కింద 500 చదరపు గజాల లోపు విస్తీర్ణం కలిగిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మెమో నంబర్ 48030 జారీ చేశామని, జీఓ 59 అమలులో అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో జీఓ 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కన్వేయన్స్ డీడ్లు జారీ చేసిన కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ అంశానికి సంబంధించిన 10 నుంచి 12 రకాల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని వివరించారు. జీఓ 118, జీఓ 76కు అనుగుణంగా మెమోలు జారీ చేశామని, 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ లేదా మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికీ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!