

రైళ్ల సమయపాలనలో భారతీయ రైల్వేలు జర్మనీని అధిగమించాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారతీయ రైల్వేలు 77 శాతం సమయపాలన రేటును సాధించగా, జర్మనీకి చెందిన రైల్వే ఆపరేటర్ డాయిచ్ బాన్ 72 శాతంతో వెనుకబడిందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రైల్వే వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఈ పురోగతికి ప్రధాన కారణమని వివరించారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ల నిర్వహణను మెరుగుపరచడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, రైళ్ల నిర్వహణ షెడ్యూళ్లలో సంస్కరణలు చేపట్టడం వల్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు.
రైళ్ల రాకపోకల్లో మరింత కచ్చితత్వం సాధించడంతో పాటు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వేలు కొత్త విధానాలపై దృష్టి సారిస్తున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగా జపాన్ అనుసరిస్తున్న అత్యంత కచ్చితమైన రైల్వే నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జపాన్ రైల్వే వ్యవస్థలోని అత్యాధునిక నిర్వహణ పద్ధతులను పరిశీలించి, వాటిని భారతీయ రైల్వేల్లో అమలు చేయడం ద్వారా సమయపాలనను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!