

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుల మోత మోగిస్తోంది. సెప్టెంబర్ 9న ఏకంగా 19,543 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదై ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. తెలంగాణతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇదే అత్యధిక గరిష్ఠ డిమాండ్ కావడం విశేషం. ఆ తర్వాత కూడా డిమాండ్ భారీ స్థాయిలో కొనసాగింది. గురువారం 19,467 మెగావాట్లు, శుక్రవారం 18,954 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడం వంటి పరిస్థితులతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. జాతీయ స్థాయిలో అదనంగా దాదాపు 100 గిగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు విద్యుత్ సంస్థల అధికారులు తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లతోపాటు వ్యవసాయం, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడంతో డిమాండ్‌పై ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో నమోదైన ఈ రికార్డు డిమాండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని స్పష్టం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!