

తెలంగాణలో ఎస్‌ఐ (సివిల్), సమాన స్థాయి పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్ 29న జరగనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 335 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 275 పోస్టుల కోసం జరిగే ఈ పరీక్షకు 1,60,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లను ఏ4 సైజు పేపర్‌పై ప్రింట్ తీసుకుని, దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను నిర్దేశిత ప్రదేశంలో అతికించాలని బోర్డు సూచించింది. ఫొటో లేని హాల్‌టికెట్లతో పరీక్షకు అనుమతించరు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్‌టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, పుస్తకాలు, నోట్స్, హ్యాండ్‌బ్యాగులు నిషేధం. బయోమెట్రిక్స్, వేలిముద్రలు, ఫొటో, సంతకంతో పాటు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ నిర్వహించనున్నారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషల్లో ఉంటాయి. పరీక్ష అనంతరం ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. హాల్‌టికెట్ సమస్యలుంటే support@tslprb.inకు మెయిల్ చేయాలని లేదా 040-41895151 నంబర్‌ను సంప్రదించాలని TSLPRB ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!