

చేయూత పథకంలో అక్రమాలను అరికట్టడంతో పాటు పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పింఛను మొత్తాలను నగదు రూపంలో కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, కూలీలు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం కొంతమందికి బ్యాంకుల ద్వారా, మరికొంతమందికి నగదు లేదా తపాలా ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
నగదు చెల్లింపుల్లో అక్రమాలపై ఫిర్యాదులు రావడం, పోస్టాఫీసుల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ అధికారులు అన్ని పింఛన్లను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జూన్ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆగస్టు నుంచి పింఛను మొత్తాలు నేరుగా ఖాతాల్లో జమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!