

నల్గొండ జిల్లా దామెరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గు, బూడిద నిర్వహణ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ టెండర్లు పిలవడం వివాదానికి దారితీసింది. పెంచిన వ్యయంతో పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ఇంజినీర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు ప్రైవేట్ సంస్థలకు అప్పగించినా పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమకే ఇవ్వాలని ఇంజినీర్లు కోరుతున్నారు. ఇతర విద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే విధానం అమలవుతోందని వారు పేర్కొంటున్నారు.
బొగ్గు, బూడిద నిర్వహణ పనులను రూ.360 కోట్లకు చేపట్టేందుకు బీహెచ్‌ఈఎల్ ముందుకొచ్చినప్పటికీ, రూ.180 కోట్లకే పనులు చేయాలని ఆ సంస్థను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.250 కోట్లకు ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగించేందుకు టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఓ ఇంజినీర్‌పై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతలను ఇంజినీర్లకు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెండర్లలో మూడు సంస్థలు అర్హత సాధించగా, త్వరలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!