

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పికో టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పికో వ్యవస్థాపకుడు, సీఈఓ జారోడ్ యస్టర్, ఏఐసీఓకు చెందిన జి. సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్లోబల్ సమ్మిట్ విధానాన్ని తీసుకొచ్చామని, రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో తెలంగాణను పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతకు అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పికో టెక్నాలజీ ఇండియా హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొస్తుందని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటిలో దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!