

సైబర్ భద్రతా సమస్యలను వేగంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు అన్‌రిలీజ్డ్ ఏఐ మోడల్ ఆధారంగా ప్రత్యేక పైప్‌లైన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు OpenAI వెల్లడించింది. ఈ వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను గుర్తించడం, వాటిని పరీక్షించి నిర్ధారించడం, పరిష్కారాలను రూపొందించడం వంటి పనులను పెద్ద స్థాయిలో చేపట్టగలదు. సంస్థ అంతర్గత పరీక్షల ప్రకారం.. ఈ ప్రోటోటైప్ Linux కెర్నల్‌లో 2,308 అనుమానాస్పద భద్రతా సమస్యలను గుర్తించి విశ్లేషించింది. వాటిలో 1,724 లోపాలను పరీక్షల ద్వారా పునరుత్పత్తి చేయగలిగింది. అలాగే పరిమిత యాక్సెస్ ఉన్న స్థానిక వినియోగదారుడు అడ్మినిస్ట్రేటర్ స్థాయి అధికారాలను పొందేందుకు వీలుకల్పించే 948 లోకల్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ (LPE) ఎక్స్‌ప్లాయిట్లను రూపొందించింది. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 12.13 లక్షల డాలర్ల ఏపీఐ క్రెడిట్లు ఖర్చయ్యాయని, ఒక్కో ఎక్స్‌ప్లాయిట్‌కు సగటున 1,279 డాలర్లు వ్యయమైనట్లు OpenAI తెలిపింది. ఈ ప్రక్రియలో తమ ఏఐ ఏజెంట్లు గతంలో తెలియని కనీసం 10 Linux ఎక్స్‌ప్లాయిటేషన్ పద్ధతులను గుర్తించి ఉపయోగించాయని పేర్కొంది.
గతంలో GPT-5.5-Cyber మోడల్ సాయంతో 2026 జూన్‌లో 24కు పైగా LPE ఎక్స్‌ప్లాయిట్లను గుర్తించిన OpenAI.. తాజా పరిశోధనలో మరింత పురోగతి సాధించింది. అక్టోబర్ మధ్యలో నిర్వహించిన పరీక్షలో 30 గంటల్లోనే 1,724 లోపాలను పునరుత్పత్తి చేసి, 291 సమాచార లీకేజీ సమస్యలకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లాయిట్లతో పాటు 948 LPE ఎక్స్‌ప్లాయిట్లను రూపొందించినట్లు వెల్లడించింది. ఈ ఏఐ పైప్‌లైన్ ఐదు దశల్లో పనిచేస్తుంది. మొదట భద్రతా లోపాలను గుర్తించడం, ఆ తర్వాత సురక్షితమైన శాండ్‌బాక్స్ వాతావరణంలో వాటిని పరీక్షించడం, దుర్వినియోగం చేసే అవకాశాలను అంచనా వేయడం, పరిష్కారాలను రూపొందించడం, చివరగా నిపుణులతో వాటిని సమీక్షించడం జరుగుతుంది. మానవ నిపుణుల పరిశీలన తర్వాతే పరిష్కారాలను సంబంధిత సాఫ్ట్‌వేర్ నిర్వహణ బృందాలకు పంపిస్తామని OpenAI తెలిపింది. సైబర్ దాడులను వేగవంతం చేసే సామర్థ్యం ఏఐకి ఉన్నప్పటికీ, భద్రతా లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దడంలోనూ అది కీలకంగా మారుతోందని ఈ పరిణామం సూచిస్తోంది. Google Threat Intelligence Group నివేదిక ప్రకారం.. 2026 జనవరిలో నెలకు 5,045గా ఉన్న భద్రతా లోపాల వెల్లడి ఆగస్టు నాటికి 10,740కి పెరిగింది. అధిక ప్రమాద స్థాయి లోపాల వెల్లడి కూడా 167 శాతం పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!