

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ మధ్య కొనసాగుతున్న పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 16న జరగాల్సిన ట్రంప్ వాంగ్మూలం వాయిదా పడింది. దేశానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కారణంగా ఆ రోజు కోర్టు విచారణకు హాజరుకాలేరని ట్రంప్ తరఫు న్యాయవాదులు వెల్లడించినట్లు సమాచారం. అయితే విచారణను నిరవధికంగా వాయిదా వేయలేమని పేర్కొంటూ బీబీసీ కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్ మధ్య వరకు ట్రంప్ అందుబాటులో ఉండరని, విచారణను జనవరికి వాయిదా వేయాలని ఆయన న్యాయవాదులు సూచించినట్లు బీబీసీ తెలిపింది. కేసు విచారణకు సంబంధించి మరో రెండు నెలల గడువు మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటూ, ట్రంప్ వాంగ్మూలానికి నిర్దిష్ట తేదీని ఖరారు చేయాలని న్యాయమూర్తిని కోరింది.
2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించి ట్రంప్ చేసిన ప్రసంగంలోని దృశ్యాలను బీబీసీ ఓ డాక్యుమెంటరీలో ఎడిట్ చేసి ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ ఎడిటింగ్ వల్ల తాను హింసను ప్రేరేపించినట్లు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడిందని పేర్కొంటూ, 2025 డిసెంబర్లో బీబీసీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తొలుత 10 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరిన ట్రంప్.. అనంతరం తన ప్రతిష్ఠకు జరిగిన నష్టంపై దృష్టి సారించారు. ఈ వివాదంపై బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ట్రంప్ను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!