

కార్తీక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు, యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమిళనాడులోని అరుణాచలం, కేరళంలోని శబరిమల, ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలకు ఈ సేవలను ఏర్పాటు చేసింది. కనీసం 30 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును కూడా సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం నవంబర్ 23న హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే అవకాశం కల్పించారు. తిరుగు ప్రయాణంలో గద్వాల్‌లోని జోగులాంబ ఆలయ దర్శనం ఉంటుంది. ఈ ప్యాకేజీకి పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 టికెట్ ధరగా నిర్ణయించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు 36 మంది కలిసి బస్సు బుక్ చేసుకుంటే ప్రత్యేక సర్వీసును కేటాయిస్తారు. ఇందులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఇక పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలకు ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఒకే రోజులో ఐదు ఆలయాలను సందర్శించేలా ఈ యాత్రను రూపొందించారు. పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,500 టికెట్ ధరగా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం 96521 24049 నంబరును సంప్రదించాలని అధికారులు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!