

హిందూ సంప్రదాయంలో తులసి కల్యాణానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కార్తిక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి రోజున ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తులసి దేవిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా, ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి వివాహం జరిపిస్తారు. స్కంద పురాణం ప్రకారం, తులసి పూర్వజన్మలో వృంద అనే కన్య. ఆమె రాక్షస రాజైన జలంధరుడి భార్య. వృంద పాతివ్రత్య మహిమతో జలంధరుడు అపారమైన శక్తిని పొందుతాడు. లోకకల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లడంతో ఆమె పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. అనంతరం జలంధరుడు శివుడి చేతిలో మరణిస్తాడు. ఈ సంఘటనల తర్వాత వృంద చితాభస్మం నుంచి తులసి, ఉసిరి, మాలతి మొక్కలు ఆవిర్భవించినట్లు పురాణ కథనం. ఈ నేపథ్యమే తులసి కల్యాణ సంప్రదాయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇంట్లో తులసి కోట పరిసరాలను శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరించాలి. తులసి మొక్కను వధువుగా భావించి పసుపు, కుంకుమ, పూలు, ఆభరణాలతో అలంకరించాలి. ఉసిరి కొమ్మను లేదా సాలిగ్రామాన్ని వరుడిగా భావించి నూతన వస్త్రాలతో అలంకరించాలి. అనంతరం షోడశోపచార పూజలు, అష్టోత్తర పూజలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన నిర్వహించాలి. పవిత్ర మాలల మార్పిడి, తలంబ్రాలు, నైవేద్యం, మంగళహారతి వంటి వివాహ సంప్రదాయాలను పాటించాలి. పూజ అనంతరం తులసి, ఉసిరి మొక్కలకు ప్రదక్షిణలు చేయాలి. పుణ్య దంపతులను ఆహ్వానించి భోజనం పెట్టి, వస్త్రాలు, తాంబూలాలతో సత్కరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తులసి కల్యాణం నిర్వహించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని, అవివాహితులకు వివాహ యోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఇవి సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పే విషయాలని గుర్తుంచుకోవాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!