

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ధ్రువీకరణ పత్రంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేస్తున్న కుటుంబ రిజిస్టర్ ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఆర్‌సీ)ను పరిగణనలోకి తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎఫ్‌ఆర్‌సీని రేషన్ కార్డులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జారీ చేస్తున్నందున, అది రేషన్ కార్డుతో సమానమైన పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆమోదించిన 12 ధ్రువీకరణ పత్రాల జాబితాలో రేషన్ కార్డు లేనందున, దాని ఆధారంగా జారీ చేసే ఎఫ్‌ఆర్‌సీని ప్రత్యేక సమగ్ర సవరణలో ధ్రువీకరణ పత్రంగా స్వీకరించలేమని వెల్లడించింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలై 25న జారీ చేసిన మెమో ఆధారంగా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జారీ చేసిన పాత కుటుంబ రిజిస్టర్ ధ్రువీకరణ పత్రాలను మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఎఫ్‌ఆర్‌సీపై స్పష్టత కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. ఈ అంశంపై న్యాయస్థానంలోనూ పిటిషన్ దాఖలైంది. రాజకీయంగానూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకునే ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలని లేదా అనుమానం ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల నమోదు అధికారిని ఎదుట హాజరై, ఆమోదించిన 12 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న జీవో నంబర్ 172ను జారీ చేసి, రేషన్ కార్డులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబ రిజిస్టర్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించింది. అయితే ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం రేషన్ కార్డు ఆధారంగా జారీ చేసిన ఎఫ్‌ఆర్‌సీలను అంగీకరించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!