

పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దశాబ్దాలుగా సముద్ర కోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పాడ తీర ప్రాంతానికి దీర్ఘకాలిక పరిష్కారం కల్పించే దిశగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనలో నిపుణులైన ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఆధునిక సాంకేతికతతో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తోంది. డ్రోన్ సర్వేలు, బీచ్ ప్రొఫైలింగ్, షోర్‌లైన్ మ్యాపింగ్, బాతిమెట్రిక్ సర్వేలతో సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, తీర ఆకృతి, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు, తీర కోత తీవ్రత వంటి అంశాలను అధ్యయనం చేస్తున్నారు. ఇసుక, మట్టి నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయనాల ఆధారంగా రక్షణ గోడకు అనువైన అలైన్‌మెంట్‌ను నిర్ణయించి డిజైన్, డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. పర్యావరణంతో పాటు అవసరమైన ఇతర అనుమతుల ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!