

తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మరోసారి ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని కేసీఆర్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద అవసరమైన మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకువస్తే అనేక జిల్లాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగిస్తే పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకులతో చర్చించి లక్షలాది మందితో ప్రత్యక్ష కార్యాచరణ చేపడతానని కేసీఆర్ ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలను బలంగా ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న భూముల సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ, విద్యారంగం, గురుకులాలు, మహిళల భద్రత, శాంతిభద్రతలు, విద్యుత్ విధానాలు, రైతులకు ఉచిత విద్యుత్, ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ వంటి అంశాలను కూడా సభల్లో ప్రస్తావించాలని కేసీఆర్ తెలిపారు. ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ, సింగరేణి, హైదరాబాద్ మెట్రో రైలు, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం పెరిగాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ, మండలిలో బలంగా వినిపించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బండ ప్రకాష్, మధుసూదనాచారి, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!