

అమెరికాలో కనీసం పదేళ్లుగా నివసిస్తున్న కొందరు వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించే ఉద్దేశంతో డెమోక్రాట్లు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం.. తుది బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, నిర్దేశిత అర్హతలు కలిగిన వారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల కాలపరిమితి విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇలాంటి ఉత్తర్వులకు ఎలాంటి గడువు లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై బహిష్కరణ చర్యలను ముమ్మరం చేసిన తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 19న కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ నేతలు లతీఫా సిమన్, జోయ్ లాఫ్గ్రెన్, జాన్ గరమెండి, వర్గస్ ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.
అయితే, బహిష్కరణ ఉత్తర్వులు ఎదుర్కొంటున్న వలసదారులందరికీ ఈ ప్రతిపాదన వర్తించదు. తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా కనీసం పదేళ్లపాటు అమెరికాలో నివసించి ఉండాలి. ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిర్దిష్ట ఉల్లంఘనల కారణంగానే బహిష్కరణ ఉత్తర్వులు పొంది ఉండాలి. ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించకూడదు. తీవ్రమైన నేరాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో సంబంధం ఉండకూడదు. తాజా ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్న్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26 నాటికి సుమారు 16 లక్షల మంది తుది బహిష్కరణ ఉత్తర్వులు పొందారు. అయితే, ఈ బిల్లు చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా అవసరం. వలసల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!