

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అదుర్స్’ సినిమాలో ఆయన బామ్మగా నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులర్పించేందుకు వీలుగా ఆమె పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన వత్సల.. ముఖ్యంగా ‘అదుర్స్’లోని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆమె మృతి వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన వత్సల రాజగోపాల్‌కు చిన్నతనం నుంచే నాటక రంగంపై ఆసక్తి ఉండేది. వివాహం అనంతరం 1953లో చెన్నైకి వెళ్లిన ఆమె అక్కడ కొంతకాలం క్లర్క్‌గా పనిచేశారు. వీధి నాటకాల్లో ఆమె ప్రదర్శనలు దర్శకుడు మణిరత్నం దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ చిత్రంలో తొలిసారి నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె, పలు టెలివిజన్ సీరియల్స్‌లోనూ కనిపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!