

వినాయక చవితిని తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున జరుపుకోవడం సంప్రదాయం. ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 14, 15 తేదీల్లో వ్యాపించడంతో పండుగ ఏ రోజు నిర్వహించాలనే విషయంలో భక్తుల్లో సందిగ్ధత ఏర్పడింది. అయితే పండితులు వివరించిన శాస్త్ర నియమాల ప్రకారం చవితి తిథి మధ్యాహ్న సమయంలో ఉండటానికి ప్రాధాన్యం ఉంటుంది. వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడనే పురాణ విశ్వాసం కారణంగా సెప్టెంబర్ 14, సోమవారం మధ్యాహ్నం చవితి తిథి పూర్తిగా ఉండటంతో ఆ రోజే పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12:09 నుంచి 12:58 వరకు అభిజిత్ ముహుర్తం ఉంది. వినాయకుడి పూజ, విగ్రహ ప్రతిష్ఠాపనకు ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు సమయం శుభప్రదంగా పేర్కొంటున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఆ రోజున బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం కూడా ఏర్పడనున్నాయి. చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉండి, ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. అనివార్య కారణాలు లేదా స్థానిక ఆచారాల వల్ల సెప్టెంబర్ 14న పూజ చేయలేని వారు సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు చవితి తిథి ముగిసేలోపు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
గమనిక: పండుగ తేదీ, శుభ ముహుర్తాలు, యోగాలు, పూజా విధానాలకు సంబంధించిన వివరాలు పంచాంగం, మతపరమైన సంప్రదాయాలు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడినవి. ప్రాంతాన్ని బట్టి, స్థానిక ఆచారాలను బట్టి సమయాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ వివరాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేవు. స్థానికంగా సరైన వివరాల కోసం పండితులు లేదా పురోహితులను సంప్రదించడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!