

ప్రముఖ బిలియనీర్ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థకు చెందిన సుమారు 5.47 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.49 వేల కోట్ల) విలువైన షేర్లను తన కుటుంబం నిర్వహిస్తున్న నాలుగు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. నవంబర్ 16, 2026న ప్రకటించిన ఈ విరాళంలో భాగంగా 6,150 క్లాస్-ఏ షేర్లను 92,25,000 క్లాస్-బీ షేర్లుగా మార్చారు. వీటిలో 36,90,000 షేర్లను ది సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు అందించారు. మిగిలిన మూడు సంస్థలైన ది షెర్వుడ్ ఫౌండేషన్, ది హోవార్డ్ జి. బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లకు ఒక్కొక్కటి 18,45,000 షేర్ల చొప్పున కేటాయించారు. తాజా విరాళంతో కలిపి 2026లో ఈ నాలుగు కుటుంబ స్వచ్ఛంద సంస్థలకు బఫెట్ అందించిన మొత్తం విరాళాల విలువ సుమారు 11.4 బిలియన్ డాలర్లకు చేరింది.
వాటాదారులకు పంపిన థాంక్స్‌గివింగ్ లేఖలో బఫెట్ దయ, మానవత్వం ప్రాముఖ్యతను వివరించారు. ఆర్థిక పెట్టుబడుల కంటే దయాగుణం మరింత మెరుగైన రేటుతో పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమ జీవితాల్లో నిస్వార్థంగా సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పాలని లేదా ఇతరులకు సహాయం చేసే దాతలుగా మారాలని సూచించారు. 2026 సెప్టెంబర్‌లో బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన బఫెట్ ప్రస్తుతం చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతున్నారు. తాజా విరాళం అనంతరం కూడా ఆయన వద్ద 1,82,140 క్లాస్-ఏ షేర్లు, 1,162 క్లాస్-బీ షేర్లు ఉన్నాయి. వీటి విలువ 160 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. 2034 చివరి నాటికి తన వద్ద మిగిలిన షేర్లన్నింటినీ ఈ నాలుగు కుటుంబ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ఆయన ప్రణాళిక రూపొందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!