

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కథానాయికగా నటించడం లేదని, అతిథి పాత్రలో తెరపై కనిపించనున్నారని సమాచారం. సినిమాలోని 2వ భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారట. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన పాత్ర మాఫియా నేపథ్యంతో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో చిరంజీవి పాత్రలో పలు రకాల వేరియేషన్లు ఉంటాయని సమాచారం. కుటుంబ భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. కథ, పాత్రల రూపకల్పన ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా వివరాలు నిజమైతే మీనాక్షి చౌదరి అతిథి పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!