

రుచికరమైన కోడి పలావ్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కిలో చికెన్ తీసుకుని అందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కసూరి మేతి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఒక టేబుల్‌స్పూన్ నూనె కూడా వేసి మసాలాలన్నీ చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. అనంతరం మూత పెట్టి అరగంట నుంచి గంట వరకు ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌లోకి మసాలాల రుచి బాగా చేరి, మాంసం మెత్తగా తయారవుతుంది.
తర్వాత రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. పలావ్‌కు అవసరమైన మసాలా పేస్ట్ తయారు చేసేందుకు కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. జీడిపప్పు, టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. చివరగా పుదీనా, కొత్తిమీర వేసి కలిపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు బిర్యానీ పాత్రలో నాలుగు నుంచి ఐదు టేబుల్‌స్పూన్ల నూనె, రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ పూర్తిగా ఉడికించాలి. చికెన్ నుంచి నూనె వేరుపడటం ప్రారంభమైనప్పుడు సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను జోడించి, మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
బియ్యం కొలిచిన అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీటిని పోయాలి. చిట్టి ముత్యాల బియ్యం లేదా బాస్మతి బియ్యం ఉపయోగిస్తే వాటి రకాన్ని బట్టి నీటి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఉప్పు సరిపడా ఉందో చూసుకుని, నీటిని ఎక్కువ మంటపై మరిగించాలి. నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వార్చి పాత్రలో వేసి, ఒకసారి మెల్లగా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై ఉడికించాలి. బియ్యం దగ్గరపడుతూ నీరు తగ్గినప్పుడు ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కలిపి, మంటను తగ్గించి దమ్‌పై పూర్తిగా ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆపేసి మూత తీయకుండా పది నిమిషాలు అలాగే ఉంచాలి. వేడి వేడి కోడి పలావ్‌ను రైతాతో కలిపి వడ్డించుకోవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!