

రోడ్డు ప్రమాదాలు లేదా అనుకోకుండా ఆరోగ్యం క్షీణించిన సందర్భాల్లో అత్యవసర వైద్యం అందేలోపు చేసే తక్షణ సహాయాన్నే ప్రథమ చికిత్స అంటారు. సరైన సమయంలో సరైన ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య నైపుణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఈ నెల రెండో శనివారం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అకస్మాత్తుగా తలెత్తే అనారోగ్య సమస్యలు, ప్రమాదాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవడం అవసరం.
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు చాలా మంది పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి రక్షణ కల్పించేందుకు గుడ్ సమరిటన్ చట్టం కింద మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చిన వ్యక్తి తప్పనిసరిగా తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సహాయం చేసిన వ్యక్తిని సాక్షిగా ఉండాలని పోలీసులు బలవంతం చేయలేరు. సాక్ష్యం ఇవ్వాలనుకుంటే తాము ఎంచుకున్న ప్రాంతంలో వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన వ్యక్తి నుంచి డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేయరాదు. బాధితుడి పరిస్థితి విషమించినా సహాయం చేసిన వ్యక్తిపై కేవలం ఆ కారణంతో కేసు నమోదు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి.
ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈ సమయంలో అందించే తక్షణ సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు శాంతంగా పరిస్థితిని అంచనా వేసి 108 అత్యవసర సేవలకు, 100 నంబర్‌కు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితుడి శ్వాస, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణను పరిశీలించి అవసరమైతే సీపీఆర్ చేయాలి. తీవ్రంగా రక్తస్రావం అయితే శుభ్రమైన వస్త్రంతో గాయంపై గట్టిగా ఒత్తిడి చేయాలి. వెన్నెముక లేదా ఎముకలకు గాయమైనట్లు అనిపిస్తే బాధితుడిని అనవసరంగా కదిలించకూడదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!