

చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించగలవని చైనాకు చెందిన ‘నియు లై’ నిరూపిస్తోంది. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి సుమారు రూ.1 లక్ష బడ్జెట్తో రూపొందించిన ఈ 86 నిమిషాల యానిమేషన్ చిత్రం ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమాకు తొలినాళ్లలో పెద్దగా ఆదరణ లభించలేదు. తొలి పది రోజుల్లో కేవలం రూ.1.04 లక్షలు (7,700 యువాన్లు) మాత్రమే వసూలు కాగా, దేశవ్యాప్తంగా సుమారు 300 మంది మాత్రమే టికెట్లు కొనుగోలు చేశారు. అధికారిక ట్రైలర్, భారీ ప్రమోషన్లు లేకపోవడం కూడా సినిమాకు ప్రతికూలంగా మారింది.
అయితే సోషల్ మీడియాలో సినిమా నుంచి కొన్ని దృశ్యాలు వైరల్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గ్రాఫిక్స్ నాణ్యతపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తూ, ఏఐ కంటే కూడా నాసిరకంగా ఉన్నాయంటూ ట్రోల్ చేశారు. ఈ నెగెటివ్ ప్రచారమే చివరకు సినిమాకు ఊహించని పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అసలు సినిమాలో ఏముందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో టికెట్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. ప్రముఖ చైనా టికెటింగ్ ప్లాట్ఫామ్ మావోయాన్ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా, అంటే సుమారు రూ.20 కోట్ల వసూళ్లు సాధించింది. షిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ దాదాపు ఐదేళ్లు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!