

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యులను హౌస్‌లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు రెండో రౌండ్‌కు చేరుకోగా, ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ కార్డ్ సాధించిన ముగ్గురు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఇప్పటివరకు హోల్డ్‌లో ఉన్న 26 మందిలో మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేయడంతో ఆ సంఖ్య 18కి చేరింది.
తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా (జపాన్), అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో జపాన్‌కు చెందిన ఫుతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెలుగు భాషపై ఎంతో అభిమానం ఉన్న ఫుతా చాలాకాలంగా తెలుగు నేర్చుకుంటూ, జపాన్-తెలుగు మిక్సింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు సినిమా డైలాగ్స్ చెప్పే ఫుతా తనను మ్యూజిషియన్‌గా పరిచయం చేసుకున్నాడు. అయితే తెలుగు సరిగ్గా రాకపోవడంతో అతను హౌస్‌లో కొనసాగలేడని కొందరు జడ్జిలు భావించినప్పటికీ, అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చి అతన్ని ఫైనల్ రౌండ్‌కు పంపించాడు.
ఈ ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, హేమంత్ తమ తండ్రుల గురించి చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి మరణం, ఆయన జ్ఞాపకాలు, తనపై ఆయనకున్న ప్రేమ గురించి జ్యోత్స్నా చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. హేమంత్ కూడా తన తండ్రి గురించి పలు విషయాలు పంచుకున్నప్పటికీ, ఆయనతో మాట్లాడకపోవడానికి సరైన కారణాన్ని వివరించలేకపోయాడు. అయినప్పటికీ బిందు మాధవి అతనికి ఫైనల్ రౌండ్‌కు అవకాశం ఇచ్చింది. మరోవైపు, సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చిన అభిజ్ఞ తన సహజమైన మాటతీరుతో ఆకట్టుకోగా, నవదీప్ ఆమెకు ‘చదువుకున్న తింగరి’ అనే పేరు పెట్టాడు. ప్రియాంక తన టాలెంట్‌ను చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె ప్రత్యేక ప్రతిభ ఏమిటో స్పష్టంగా తెలియలేదు. దీంతో అగ్నిపరీక్ష తొలి దశ ముగియగా, అసలు పోటీ ముందుందని తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!