

ప్రముఖ సినీ నటుడు నవీన్ చంద్ర మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. నవీన్ చంద్రతో పాటు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, పంపిణీదారు, నిర్మాత హరీష్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల నవీన్ చంద్ర మాట్లాడుతూ, తలపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల నుంచే తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నామని, ‘మంత్ ఆఫ్ మధు’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్తో కలిసి చేస్తున్న ఈ రెండో చిత్రం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్గా ఉండబోతోందని చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో తన మూడు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మను కలిసి అభినందించిన నవీన్ చంద్ర, కళాకారుడిగా ఎస్వీబీసీలో కార్యక్రమాలు నిర్వహించేందుకు, శ్రీవారి సేవలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!