

పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘పరివారిక్ మనోరంజన్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 13 నుంచి సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొన్న అదితి రావు హైదరి సినిమా నిర్మాణం, మార్కెటింగ్‌పై తన అభిప్రాయాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. మార్కెటింగ్ అనేది సినిమాలోని మంచి అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప, బలహీనమైన కథను కాపాడలేదని ఆమె స్పష్టం చేశారు.
సినిమా నిర్మాణాన్ని వంట చేయడంతో పోల్చిన అదితి.. ఖిచ్డీ అయినా, బిర్యానీ అయినా సరైన పదార్థాలు, తగినంత సమయం కేటాయించినప్పుడే రుచిగా తయారవుతుందని చెప్పారు. పైకి ఎంత అందంగా అలంకరించినా, సరిగ్గా ఉడకని వంటకాన్ని ఎవరూ ఇష్టపడరని అన్నారు. అలాగే సినిమా తీసేటప్పుడు కథను, నటీనటులను ప్రేమిస్తూ పూర్తి నిజాయితీతో పనిచేయాలని సూచించారు. గతంలో ఎంతోమంది గొప్ప దర్శకులు మార్కెట్ ట్రెండ్స్‌ను అనుసరించకుండా తమ నమ్మకంతో సినిమాలు తీశారని గుర్తుచేశారు. ముందుగా మంచి కథను సిద్ధం చేసుకుని, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విడుదల సమయంలో ఆశించిన విజయం అందుకోకపోయినా, మంచి కథతో రూపొందిన సినిమాకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!