

పండగ సీజన్ వచ్చిందంటే చాలు టాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీలు, థియేటర్ల కేటాయింపులపై పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో స్టార్ హీరోల మధ్య పోటీ తారాస్థాయికి చేరుతుంది. అయితే బాక్సాఫీస్ లెక్కలు, వ్యక్తిగత పట్టింపుల కంటే పరిశ్రమ ప్రయోజనాలే ముఖ్యమని కోలీవుడ్ హీరోలు సూర్య, ధనుష్ నిరూపించారు. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న 'ఓం: చాప్టర్ 1' చిత్రాన్ని తొలుత అక్టోబర్ 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతకుముందు రోజు రజనీకాంత్ 'జైలర్ 2' ఉండటంతో తన సినిమాను వాయిదా వేశారు. అనంతరం నవంబర్ 6న సూర్య నటిస్తున్న 'సీన్' విడుదలకు సిద్ధమవడంతో ఆ తేదీని కూడా వదులుకున్నారు.
తోటి హీరో సినిమాకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ధనుష్ తన చిత్రాన్ని నవంబర్ 20కి మార్చుకున్నారు. ఈ నిర్ణయంపై సూర్య సైతం ప్రశంసలు కురిపించారు. తన సినిమా కోసం విడుదల తేదీని కేటాయించిన ధనుష్‌కు ఆడియో, ట్రైలర్ వేడుకలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు టాలీవుడ్‌లో మాత్రం ప్రతీ సంక్రాంతికి పలువురు అగ్ర హీరోలు ఒకేసారి బరిలోకి దిగుతున్నారు. దీనివల్ల నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనవసరమైన పోటీకి దూరంగా ఉండి, ఒకరి సినిమాలను మరొకరు గౌరవించుకోవాలనే సందేశాన్ని ఈ ఇద్దరు హీరోలు ఇచ్చారు. మరి మన స్టార్ హీరోలు ఈ మంచి పాఠాన్ని ఎప్పుడు నేర్చుకుంటారో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!